ఐపీఎల్ 2020: రూ.2కోట్ల కనీస ధరలో ఒక్క భారత క్రికెటర్ లేడు..!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-2020 ఎడిషన్ కోసం నిర్వహించే వేలానికి 332 మంది ఆటగాళ్లతో తుది జాబితాను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది.
కోల్‌కతా వేదికగా ఈనెల 19న జరిగే ఐపీఎల్ వేలానికి రికార్డు స్థాయిలో 971 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
ఫ్రాంఛైజీల సలహాలు, అభ్యర్థల తర్వాత జాబితాను కుదించారు.
332 మంది క్రికెటర్లు ఖాళీగా ఉన్న 73 స్థానాల కోసం పోటీపడనున్నారు.
అత్యధిక రిజర్వ్ ధరను రూ.2కోట్లుగా నిర్ణయించారు.
ఇందులో రూ.2కోట్ల కనీస ధరలో భారత క్రికెటర్లెవరూ లేకపోవడం గమనార్హం.
ఇదే ధరతో ఏడుగురు విదేశీ స్టార్ ప్లేయర్లు పాట్ కమిన్స్, జోష్ హేజిల్ వుడ్, క్రిస్‌లిన్, మిచెల్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, డేల్ స్టెయిన్, మాథ్యూస్ అత్యధిక వెలతో బరిలో దిగుతున్నారు.
భారత ఆటగాడు రాబిన్ ఉతప్ప కనీస ధర రూ.1.5 కోట్లుగా నిర్ణయించారు.
ఇందులో ఒక్కడికి మాత్రమే చోటు దక్కింది. పియూశ్ చావ్లా, యూసుఫ్ పఠాన్, జయదేశ్ ఉనద్కత్‌ల కనీస ధర రూ.1కోటిగా నిర్ణయించారు.
మొత్తం 186 మంది భారతీయులు, 143 మంది విదేశీ ఆటగాళ్లు, ముగ్గురు అసోసియేట్ దేశాలకు చెందిన క్రికెటర్లు 2020 ఐపీఎల్ వేలంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.