మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

వైజాగ్‌లో వీరంగం

నమస్తే తెలంగాణ లోగో నమస్తే తెలంగాణ 19-12-19 Namasthe Telangaana

రోజర్‌ ఫెదరర్‌, రఫేల్‌ నాదల్‌ కలిసి డబుల్స్‌ మ్యాచ్‌ ఆడినట్లు..అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌ కలిసి ఒకే సినిమాలో కనిపించినట్లు.. వైజాగ్‌ పిచ్‌పై భారత ఆటగాళ్లు వీరంగం ఆడారు. మొదట రోహిత్‌ శర్మ, లోకేశ్‌ రాహుల్‌ సెంచరీలతో కదం తొక్కితే.. మేమేం తక్కువా అన్నట్లు యువ ద్వయం శ్రేయాస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. విండీస్‌ బౌలర్లకు పట్టపగలే చుక్కలు చూపుతూ సిక్సర్ల వర్షం కురిపించారు.

అచ్చొచ్చిన మైదానంలో భారత సారథి విరాట్‌ కోహ్లీ డకౌటైనా ఆ ప్రభావం ఏమాత్రం కనిపించనివ్వకుండా చెలరేగిపోవడంతో టీమ్‌ఇండియా భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో హోప్‌, పూరన్‌ ధాటిగా ఆడుతుండటంతో ఒక దశలో గెలుపు కష్టమే అనిపించినా.. కుల్దీప్‌ యాదవ్‌ హ్యాట్రిక్‌కు మహమ్మద్‌ షమీ డబుల్‌ తోడవడంతో విండీస్‌ చేతులెత్తేసింది. సిరీస్‌ సమం చేసిన కోహ్లీ అండ్‌ కో.. ఇక కటక్‌లో ఫైనల్‌ కాని ఫైనల్‌ ఆడేందుకు సమాయాత్తమవుతున్నది.

ROHIT-SHARMA © నమస్తే తెలంగాణ ద్వారా అందించబడింది ROHIT-SHARMA

విశాఖపట్నం: చావో రేవో మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజృంభించింది. మొదట బ్యాటింగ్‌లో కొండంత స్కోరు చేసిన విరాట్‌ సేన అనంతరం బౌలింగ్‌లోనూ ఆకట్టుకొని మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. బుధవారం ఇక్కడి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్‌ 107 పరుగులతో జయభేరి మోగించింది. హిట్‌మ్యాన్‌ రోహిత్‌ శర్మ (138 బంతుల్లో 159; 17 ఫోర్లు, 5 సిక్సర్లు), లోకేశ్‌ రాహుల్‌ (104 బంతుల్లో 102; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీలు బాదడంతో కోహ్లీ సేన నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లకు 387 పరుగులు చేసింది. మిడిలార్డర్‌లో యువ ద్వయం శ్రేయాస్‌ అయ్యర్‌ (32 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్సర్లు), పంత్‌ (16 బంతుల్లో 39; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో సాగర తీరంలో పరుగుల సునామీ వచ్చినైట్లెంది. 

KL-RAHUL © నమస్తే తెలంగాణ ద్వారా అందించబడింది KL-RAHUL

అనంతరం లక్ష్యఛేదనలో హ్యాట్రిక్‌ హీరో కుల్దీప్‌ యాదవ్‌ (3/52), షమీ (3/39) ధాటికి విండీస్‌ 43.3 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. హోప్‌ (85 బంతుల్లో 78; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) మరోసారి నిలకడ ప్రదర్శించగా.. పూరన్‌ (47 బంతుల్లో 75; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) అదరగొట్టాడు. వీరిద్దరు మినహా మిగిలినవారు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. రోహిత్‌ శర్మకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక మూడో వన్డే ఆదివారం కటక్‌లో జరుగనుంది.

KULDEEP © నమస్తే తెలంగాణ ద్వారా అందించబడింది KULDEEP

వన్డే క్రికెట్‌లో భారత్‌ తరఫున రెండు హ్యాట్రిక్‌లు నమోదు చేసిన తొలి బౌలర్‌గా కుల్దీప్‌ నిలిచాడు

ఇది కదా కావాల్సింది

గత మ్యాచ్‌లో ఆకట్టుకోలేకపోయిన టీమ్‌ఇండియా ఓపెనర్లు ఈసారి ఇరగదీశారు. టాస్‌ గెలిచి భారత్‌కు బ్యాటింగ్‌ ఎందుకు అప్పగించానా అని పొలార్డ్‌ చింతించే విధంగా చెలరేగిపోయారు. ఆరంభంలో ఆచితూచి ఆడే రోహిత్‌ మరోసారి తన పంథా కొనసాగించగా.. రాహుల్‌ మాత్రం మొదటి నుంచే ధాటిగా ఆడుతూ వచ్చాడు. ఫలితంగా 10 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ 55/0తో నిలిచింది. ఆ తర్వాత కూడా ఏ మాత్రం జోరు తగ్గించని ఈ జోడీ స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఈ క్రమంలో మొదట రాహుల్‌ (46 బంతుల్లో), ఆ తర్వాత రోహిత్‌ (67 బంతుల్లో) అర్ధ శతకాలు పూర్తిచేసుకున్నారు. అక్కడి నుంచి వీరిద్దరు పోటీ పడి బౌండ్రీలు బాదారు.

ఒక దశ దాటాక రాహుల్‌ కాస్త నెమ్మదించినా.. టాప్‌ గేర్‌లోకి వచ్చిన రోహిత్‌ శివాలెత్తిపోయాడు. 70 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద హెట్‌మైర్‌ క్యాచ్‌ వదిలేయడంతో బతికిపోయిన హిట్‌మ్యాన్‌ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. రాహుల్‌ కంటే ముందే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో 28వ శతకం చేశాక మరింతగా రెచ్చిపోయిన రోహిత్‌.. హోల్డర్‌ బంతిని స్టేడియం బయటకు పంపాడు. సెంచరీ కాగానే రాహుల్‌ ఔటవడంతో.. తొలి వికెట్‌కు నమోదైన 227 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అచ్చొచ్చిన మైదనాంలో అభిమానుల కేరింతల మధ్య క్రీజులోకొచ్చిన కెప్టెన్‌ కోహ్లీ తొలి బంతికే ‘గోల్డెన్‌ డక్‌'గా పెవిలియన్‌ చేరాడు. వికెట్లు పడుతున్నా ఏ మాత్రం జోరు తగ్గించని రోహిత్‌ చూస్తుండగానే 150 మార్క్‌ దాటాడు. 67 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసిన రోహిత్‌.. ఆ తర్వాత వరుసగా 40, 25 బంతుల్లో ఫిఫ్టీలు కొట్టడం విశేషం. బౌండ్రీల ద్వారానే 98 పరుగులు రాబట్టిన హిట్‌మ్యాన్‌ మరింత వేగం పెంచే క్రమంలో ఔటైనా.. మిడిలార్డర్‌ సత్తాచాటడంతో భారత్‌ భారీ స్కోరు చేయగలిగింది.

అటు ఇద్దరు.. ఇటు ఇద్దరు

భారీ లక్ష్య ఛేదనలో విండీస్‌కు శుభారంభం లభించింది. తొలి ఓవర్‌ మూడో బంతికి హోప్‌ ఇచ్చిన తేలికైన క్యాచ్‌ను స్లిప్‌లో రాహుల్‌ వదిలేశాడు. దీన్ని వినియోగించుకున్న హోప్‌ నింపాదిగా ఆడితే.. లూయిస్‌ (30) ఉన్నంత సేపు వేగంగా ఆడాడు. గత మ్యాచ్‌ హీరో హెట్‌మైర్‌ (4).. రనౌట్‌ కాగా.. చేజ్‌ (4) విఫలమయ్యాడు. ఈ దశలో హోప్‌కు పూరన్‌ జతకలువడంతో విండీస్‌ ఇన్నింగ్స్‌ గాడినపడింది. 22 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద దీపక్‌ క్యాచ్‌ వదిలేయడంతో పూరన్‌ బతికిపోయాడు.

వీరిద్దరూ ఎడాపెడా బౌండ్రీలతో విరుచుకుపడటంతో 30 ఓవర్లు ముగిసేసరికి విండీస్‌ 192/3తో పటిష్ఠ స్థితిలో నిలిచింది. పూరన్‌, హోప్‌ ధాటిగా ఆడుతుండటంతో విండీస్‌ విజయం పెద్ద కష్టం కాదనిపించింది. అయితే వరుస బంతుల్లో పూరన్‌తో పాటు పొలార్డ్‌ (0)ను ఔట్‌ చేసిన షమీ భారత్‌ను పోటీలోకి తెస్తే.. 33వ ఓవర్లో కుల్దీప్‌ యాదవ్‌ హ్యాట్రిక్‌తో విండీస్‌ వెన్ను విరిచాడు. హోప్‌, హోల్డర్‌ (11), జోసెఫ్‌ (0)ను వరుస బంతుల్లో వెనక్కి పంపి వన్డేలో రెండో హ్యాట్రిక్‌ నమోదు చేసుకున్నాడు. ఫలితంగా కరీబియన్లు 210/8తో విజయానికి దూరమయ్యారు. చివర్లో కీమో పాల్‌ (46; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), పియర్‌ (21) పోరాటం ఓటమి అంతరాన్ని తగ్గించడానికే పనికొచ్చింది.

POLLARD © నమస్తే తెలంగాణ ద్వారా అందించబడింది POLLARD

కెప్టెన్‌లు గోల్డెన్‌ డక్‌

ఈ వేదికపై ఘనమైన రికార్డు ఉన్న విరాట్‌ కోహ్లీ ఎదుర్కొన్న తొలి బంతికే ‘గోల్డెన్‌ డక్‌'గా ఔటై అభిమానులను నిరాశ పరిచాడు. రాహుల్‌ ఔటైన బాధ కూడా లేకుండా స్టేడియం మొత్తం విరాట్‌ రాకకోసం ఎదురుచూస్తుంటే.. మన సారథి అలా వచ్చి ఇలా వెళ్లాడు. విండీస్‌ కెప్టెన్‌ కూడా అచ్చం ఇలాగే ఎదుర్కొన్న తొలిబంతికే పెవిలియన్‌ బాట పట్టడం కొసమెరుపు. వన్డే క్రికెట్‌లో కెప్టెన్‌లిద్దరూ మొదటి బంతికే డకౌటవడం ఇదే తొలిసారి.

PANTH-AYYAR © నమస్తే తెలంగాణ ద్వారా అందించబడింది PANTH-AYYAR

సచిన్‌-జడేజా రికార్డు బ్రేక్‌

తొలి వన్డేలో అదరగొట్టిన యువ ద్వయం శ్రేయాస్‌ అయ్యర్‌, రిషబ్‌ పంత్‌ విశాఖలో పూనకం వచ్చినవాళ్లలా విరుచుకుపడింది. అల్జారీ జోసెఫ్‌ వేసిన 45వ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన పంత్‌.. కాట్రెల్‌కు పట్టపగలే చుక్కలు చూపాడు. అతడి ఓవర్‌లో 6,0,4,6,4,4తో 24 రన్స్‌ రాబట్టాడు. మరుసటి ఓవర్‌లో బాదే బాధ్యత అయ్యర్‌ తీసుకున్నాడు. చేజ్‌ వేసిన 47వ ఓవర్లో అయ్యర్‌ 6,6,4,6,6 అరుసుకోవడంతో మైదానం మోత మోగిపోయింది. ఈ ఓవర్‌లో మరో 3 పరుగులు కూడా రావడంతో.. మొత్తం 31 పరుగులు మన ఖాతాలో చేరాయి. వన్డేల్లో ఒక ఓవర్‌లో టీమిండియాకు ఇదే అత్యధిక స్కోరు. దీంతో 20 ఏండ్ల క్రితం సచిన్‌-జడేజా (28 పరుగులు) నెలకొల్పిన రికార్డు తెరమరుగైంది. చివర్లో అయ్యర్‌, పంత్‌ ఔటైనా.. జాదవ్‌ (16 నాటౌట్‌; 3 ఫోర్లు) విలువైన పరుగులు చేశాడు.

VK © నమస్తే తెలంగాణ ద్వారా అందించబడింది VK

కోహ్లీ @ 400

విశాఖ మైదానంతో ఎంతో అనుబంధం ఉన్న విరాట్‌ కోహ్లీ.. బుధవారం మ్యాచ్‌లో ఇక్కడ మరో మైలురాయి దాటాడు. ఈ వేదికపై జరిగిన గత మ్యాచ్‌లో వన్డేల్లో అత్యంత వేగంగా (205 ఇన్నింగ్స్‌ల్లో) 10 వేల పరుగులు పూర్తిచేసుకున్న కోహ్లీ.. ఈ మ్యాచ్‌తో మూడు ఫార్మాట్‌లలో కలిపి అంతర్జాతీయ క్రికెట్‌లో 400వ వన్డే ఆడాడు. 2008లో శ్రీలంకపై అరంగేట్రం చేసిన విరాట్‌.. ఇప్పటి వరకు 241 వన్డేలు, 84 టెస్టులు, 75 టీ20లు ఆడాడు. భారత్‌ తరఫున సచిన్‌ (664), ధోనీ (538), ద్రవిడ్‌ (509), అజారుద్దీన్‌ (433), గంగూలీ (424), కుంబ్లే (403), యువరాజ్‌ సింగ్‌ (402) మాత్రమే నాలుగొందలకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడారు. ఓవరాల్‌గా కోహ్లీ ఈ మైలురాయి దాటిన 33వ ఆటగాడిగా నిలిచాడు.

స్కోరు బోర్డు

భారత్‌: రోహిత్‌ (సి) హోప్‌ (బి) కాట్రెల్‌ 159, రాహుల్‌ (సి) చేజ్‌ (బి) జోసెఫ్‌ 102, కోహ్లీ (సి) చేజ్‌ (బి) పొలార్డ్‌ 0, అయ్యర్‌ (సి) హోప్‌ (బి) కాట్రెల్‌ 53, పంత్‌ (సి) పూరన్‌ (బి) పాల్‌ 39, జాదవ్‌ (నాటౌట్‌) 16, జడేజా (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 18, మొత్తం: 50 ఓవర్లలో 387/5. వికెట్ల పతనం: 1-227, 2-232, 3-292, 4-365, 5-373, బౌలింగ్‌: కాట్రెల్‌ 9-0-83-2, హోల్డర్‌ 9-0-45-0, పియర్‌ 9-0-62-0, పాల్‌ 7-0-57-1, జోసెఫ్‌ 9-1-68-1, చేజ్‌ 5-0-48-0, పొలార్డ్‌ 2-0-20-1. వెస్టిండీస్‌: లూయిస్‌ (సి) అయ్యర్‌ (బి) శార్దూల్‌ 30, హోప్‌ (సి) కోహ్లీ (బి) కుల్దీప్‌ 78, హెట్‌మైర్‌ (రనౌట్‌) 4, చేజ్‌ (బి) జడేజా 4, పూరన్‌ (సి) కుల్దీప్‌ (బి) షమీ 75, పొలార్డ్‌ (సి) పంత్‌ (బి) షమీ 0, హోల్డర్‌ (స్టంప్డ్‌) పంత్‌ (బి) కుల్దీప్‌ 11, పాల్‌ (బి) షమీ 46, జోసెఫ్‌ (సి) జాదవ్‌ (బి) కుల్దీప్‌ 0, పియర్‌ (సి) కోహ్లీ (బి) జడేజా 21, కాట్రెల్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు: 11, మొత్తం: 43.3 ఓవర్లలో 280 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-61, 2-73, 3-86, 4-192, 5-192, 6-210, 7-210, 8-210, 9-260, 10-280, బౌలింగ్‌: దీపక్‌ 7-1-44-0, శార్దూల్‌ 8-0-55-1, షమీ 7.3-0-39-3, జడేజా 10-0-74-2, కుల్దీప్‌ 10-0-52-3, అయ్యర్‌ 1-0-13-0.

More from Namsthe Telangana

image beaconimage beaconimage beacon