మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

యూపీ సున్నీ వక్ఫ్‌ బోర్డు: ‘అయోధ్యపై సుప్రీంకోర్టు తీర్పును అంగీకరిస్తున్నాం.. రివ్యూ పిటిషన్ వేయం’

BBC తెలుగు లోగో BBC తెలుగు 2 రోజుల క్రితం

లైవ్ రిపోర్టింగ్

17:36

హిందువుల తరఫున వాదించిన కేకే ఎవరు?

అయోధ్య కేసు విషయంలో రామ్‌లాలా విరాజామన్ తరపున సీనియర్ న్యాయవాది కె.కె. పరాశరన్వాదనలు వినిపించారు. పరాశరన్‌కు ఇప్పుడు 93 ఏళ్లు. రాముడు కోసం తన యువ బృందంతో ఆయన సుప్రీంకోర్టులో వాదించారు. 1967 అక్టోబర్ 9న తమిళనాడులోని శ్రీరంగంలో జన్మించిన పరాశరన్ తమిళనాడు అడ్వొకేట్ జనరల్ గా పనిచేశారు. భారత అటార్నీ జనరల్‌గానూ పనిచేశారు.2012 నుంచి 2018 వరకు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు.

17:33

అయోధ్య తీర్పుపై పాక్ స్పందన ఏమిటి?

అయోధ్య వివాదంపై భారత సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పాకిస్తాన్ స్పందించింది.

పాకిస్తాన్ ఆర్మీ అధికార ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ ట్వీట్ చేస్తూ, "ప్రపంచం మరోసారి అతివాద భారత్ నిజరూపాన్ని చూసింది’’ అని ట్వీట్ చేశారు.

‘‘ఆగస్టు 5న కశ్మీర్ రాజ్యాంగ హోదాను భారత్ తొలగించింది. ఇప్పుడు బాబ్రీ మసీదుపై తీర్పునిచ్చింది. మరోవైపు, పాక్ మాత్రం ఇతర మతాలను గౌరవిస్తూ గురునానక్ సేవకుల కోసం కర్తార్‌పూర్ కారిడార్‌ను ప్రారంభించింది’’ అని పేర్కొన్నారు.

17:19

తీర్పును స్వాగతిస్తున్నాం, రివ్యూ పిటిషన్ వేయం - జాఫర్ ఫరూఖీ

సుప్రీంకోర్టు తీర్పును తాము స్వాగతిస్తున్నామని, వినయంగా అంగీకరిస్తున్నామని ఉత్తర ప్రదేశ్ సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ జాఫర్ ఫరూఖీ తెలిపారు. ‘‘అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వును సమీక్షించడానికి రివ్యూ పిటిషన్ కానీ, క్యురేటివ్ పిటిషన్ కానీ దాఖలు చేయడానికి యూపీ సున్నీ వక్ఫ్ బోర్డు వెళ్లదని స్పష్టం చేస్తున్నాను’’ అని ఆయన పేర్కొన్నారు.

17:05

ఐదు ఎకరాల స్థలం అవసరం లేదు: ఓవైసీ

ముస్లిం పక్షానికి ఐదు ఎకరాల స్థలం ఇవ్వాలన్న సుప్రీం తీర్పుతో ఓవైసీ విభేదించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే... ·మా చట్టపరమైన హక్కుల కోసం మేం పోరాడుతున్నాం. ముస్లింలు పేదలు, వారిపై వివక్షత ఉంది. మాకు ఉద్దీపనలు, భిక్ష అవసరం లేదు. ·ముస్లిం పర్సనల్ లా బోర్డు 5 ఎకరాల స్థలాన్ని అంగీకరిస్తుందో లేదో చూడాలి, ఈ ప్రతిపాదనను తిరస్కరించాలని నా వ్యక్తిగత అభిప్రాయం. ·హిందూ రాష్ట్ర మార్గంలో దేశం వెళుతోంది. అయోధ్య విషయాన్ని సంఘ్ పరివార్, బీజేపీలు ఉపయోగించుకుంటాయి. ·అక్కడ ఒక మసీదు ఉంది, అలాగే ఉంటుంది. 500 ఏళ్ల నుంచి అక్కడ మసీదు ఉందని మేం మా ముందుతరాలకు చెబుతాం. 1992లో, సంఘ్ పరివార్, కాంగ్రెస్ కుట్ర కారణంగా ఆ మసీదు కూలిపోయింది.

15:51

ఒకవేళ మసీదు కూల్చకపోతే, ఎలాంటి తీర్పు వచ్చేది: ఓవైసీ

రాజీవ్ ధావన్‌తో పాటు సుప్రీంకోర్టులో ముస్లింల పక్షం మాట్లాడిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఎంఐఎం నాయకుడు అసదుద్దీన్ ఓవైసీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. సుప్రీం తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విశ్వాసాలు వాస్తవాలపై విజయం సాధించాయని పేర్కొన్నారు. ‘‘ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ మాదిరిగా, మేము కూడా దీనిపై సంతృప్తి చెందడం లేదు. సుప్రీంకోర్టు సుప్రీం కావొచ్చు కానీ అది దోషరహితమైనది కాదని జస్టిస్ జేఎస్ వర్మ చెప్పారు. 1992 డిసెంబర్ 6న బాబ్రీ మసీదును కూల్చివేసిన వారితోనే ఈ రోజు ట్రస్ట్ నిర్మించి ఆలయ పనులను ప్రారంభించాలని సుప్రీంకోర్టు చెబుతోంది. మసీదు కూల్చివేయకపోతే, కోర్టు ఎలాంటి తీర్పునిచ్చేది’ అని ప్రశ్నించారు.

15:27 

మేం పూర్తి సంతృప్తితో ఉన్నాం- హషీం అన్సారీ కుమారుడు

రామ జన్మభూమి, బాబ్రీ వివాదాలకు సంబంధించిన పిటిషనర్ హషీం అన్సారీ కుమారుడు ఇక్బాల్ అన్సారీ తీర్పును స్వాగతించారు. కోర్టు తీర్పుపై పూర్తిగా సంతృప్తి చెందుతున్నట్లు తెలిపారు.

‘‘మేం 200 శాతం సంతృప్తి చెందాం. కోర్టు తన నిర్ణయాన్ని సరిచేసుకుంది. ఇంతకుముందు కోర్టును గౌరవించాం, ఈ రోజు కూడా మేం అదే చేస్తున్నాం. ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించినట్లయితే అది మంచి విషయం అవుతుంది. ప్రభుత్వం చేసే పనిని మేం అంగీకరిస్తాం. హిందూ, ముస్లిం సోదరులకు నేను ఒక విషయం చెప్పాలనుకుంటన్నా, ఈ సమస్యను ప్రభుత్వం పరిష్కరించింది, దీన్ని మనం అంగీకరించాలి’’ అని పేర్కొన్నారు.

13:33

హిందువులు మసీదు నిర్మాణం కోసం సహకారం అందించాలి- బాబా రాందేవ్

13:33

తీర్పును గౌరవించండి, సోదరభావాన్ని కాపాడండి: ప్రియాంక గాంధీ

"అయోధ్య అంశంలో భారత అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. అన్ని పక్షాలు, సమాజాలు, పౌరులు ఈ తీర్పును గౌరవిస్తూ శతాబ్దాల నుంచీ కలిసిమెలిసి ఉండే మన సంస్కృతిని కాపాడాలి. మనందరం ఒక్కటై మన సామరస్యాన్ని, సోదరభావాన్ని బలోపేతం చేయాలి"

13:27 

తీర్పును గెలుపు-ఓటమిలా చూడద్దు: మోహన్ భగవత్

జాతీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ఈ తీర్పును స్వాగతిస్తూ అందరూ సంయమనం పాటించాలని కోరారు. గొడవలు-వివాదాలకు ముగింపు పలకాలని సూచించారు. దీనిని గెలుపు-ఓటమిగా చూడకూడదని అపీల్ చేశారు.

“మనం ఇందులో భాగస్వామ్యం అందించిన సహచరులు, బలిదానాలను గుర్తుచేసుకుందాం. సోదరభావాన్ని కాపాడేలా ప్రభుత్వ, సామాజిక స్థాయిలో జరుగుతున్న పూర్తి ప్రయత్నాలను మేం స్వాగతిస్తున్నాం, వారిని అభినందిస్తున్నాం. సంయమనంతో న్యాయం కోసం వేచిచూసిన భారత ప్రజలు అభినందనకు అర్హులు. దీనిని గెలుపు-ఓటమిగా చూడకూడదు. సంయమనంతో మీ ఆనందాన్ని వ్యక్తం చేయండి. గతంలో జరిగిన అన్ని విషయాలూ మర్చిపోయి, మనందరం శ్రీరామ జన్మభూమిలో గొప్ప ఆలయం నిర్మాణం కోసం మన కర్తవ్యం నిర్వహిద్దాం” అన్నారు.

13:16 

రామభక్తి, రహీం భక్తి కాదు దేశభక్తి కావాలి: ప్రధాని నరేంద్ర మోదీ

అయోధ్య అంశంలో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ వరుస ట్వీట్లు చేశారు. "దేశ అత్యున్నత న్యాయస్థానం అయోధ్యపై తన తీర్పును వెలువరించింది. ఈ తీర్పువప ఎవరూ గెలుపు-ఓటమిలుగా చూడకూడదు. రామభక్తి ఉన్నా, రహీమ్ భక్తి ఉన్నా ఇప్పుడు మనందరం దేశభక్తి అనే భావనను బలోపేతం చేయాలి. శాంతి, సామరస్యం, ఐక్యతను కాపాడాలని దేశ ప్రజలకు నా విన్నపం"

"సుప్రీంకోర్టు ఈ తీర్పు చాలా రకాలుగా ముఖ్యమైనది. సమస్యను పరిష్కరించడానికి న్యాయ ప్రక్రియను అనుసరించడం ఎంత ముఖ్యమో ఇది చెబుతుంది. ప్రతి పక్షం తమ తమ వాదనలు వినిపించడానికి తగినంత సమయం, అవకాశం ఇచ్చారు. న్యాయ దేవాలయంలో దశాబ్దాల నాటి ఈ కేసును స్నేహపూర్వకంగా పరిష్కరించారు".

"ఈ తీర్పు న్యాయ ప్రక్రియపై సామాన్యులకు ఉన్న విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుంది". "మన దేశంలో వేల సంవత్సరాల సౌభ్రాతృత్వానికి అనుగుణంగా మన 130 కోట్ల భారతీయులకు శాంతి, సంయమనాన్ని పరిచయం చేయాలి. భారత శాంతిపూర్వక సహజీవనం అంతర్లీన భావనను పరిచయం చేయాలి.

12:51

తీర్పును స్వాగతించిన అమిత్ షా

సుప్రీంకోర్టు తీర్పును కేంద్ర హోంమంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా స్వాగతించారు. "అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ చారిత్రక తీర్పు ఒక మైలురాయిగా నిలిచిపోతుందని నాకు పూర్తి విశ్వాసం ఉంది. ఈ తీర్పు భారత ఐక్యత, సమగ్రత, సంస్కృతిని మరింత బలోపేతం చేస్తుంది”

"దశాబ్దాల నుంచీ నడుస్తున్న శ్రీ రామజన్మభూమికి సంబందించిన ఈ కేసును ఈరోజు ఈ తీర్పుతో తుదిరూపం ఇచ్చారు. భారత న్యాయ వ్యవస్థ, న్యాయమూర్తులందరినీ నేను అభినందిస్తున్నాను" అన్నారు.

12:40 

సంతోషం వ్యక్తం చేసిన మురళీ మనోహర్ జోషి

"రామ జన్మభూమి ఉద్యమంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడుగా నాకు కూడా కొంత భాగస్వామ్యం అందించే అవకాశం లభించడం చాలా ఆనందంగా ఉంది" అని మురళీ మనోహర్ జోషి చెప్పారు.

12:24

అయోధ్యలో రామ మందిరం నిర్మించాలి: కాంగ్రెస్

అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించాలని కాంగ్రెస్ భావించింది. కాంగ్రెస్ ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా భారత జాతీయ కాంగ్రెస్ శ్రీరాముడి ఆలయ నిర్మాణం వైపే నిలుస్తుందని చెప్పింది.

12:17 అయోధ్య తీర్పుపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్

11:35

సున్నీవక్ఫ్ బోర్డు న్యాయవాది అసంతృప్తి

సుప్రీం తీర్పుపై సున్నీవక్ఫ్ బోర్డు న్యాయవాది జఫర్యాబ్ జిలానీ అసంతృప్తి వ్యక్తంచేశారు. తీర్పు ప్రతి పూర్తిగా చదివాక భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని వెల్లడించారు.

11:34 

ప్రజలందరుకూడా సంయమనం పాటించి.. శాంతి భద్రతలకు సహకరించాలి: ఏపీ సీఎం జగన్

అయోధ్యలో వివాదాస్పద స్థలంపై సుప్రీంకోర్టు తీర్పు తరువాత ‘‘ప్రజలందరుకూడా సంయమనం పాటించి శాంతి భద్రతలకు సహకరించమని విజ్ఞప్తిచేస్తున్నాను’’ అంటూ ఏపీ సీఎం జగన్మోహనరెడ్డి పిలుపునిచ్చారు ‘‘అయోధ్యలో నిర్మాణంపై తీర్పునకు కట్టుబడి ఉంటామని ఇరుపక్షాలూ సుప్రీంకోర్టుకు తెలియజేసినమీదటే ఈ విషయంలో భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువడింది. ఇటువంటి పరిస్థితుల్లో మతసామరస్యానికి భంగం కలిగించేలా, రెచ్చగొట్టేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని అన్ని వర్గాలకూ విజ్ఞప్తిచేస్తున్నాను.’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. 

11:26

స్థల నిర్వహణ, ఆలయ నిర్మాణ బాధ్యతలు చూడడానికి ట్రస్ట్ ఏర్పాటు చేయాలి

కేంద్రం నేతృత్వంలో మూడు నాలుగు నెలల్లో ఒక ట్రస్టు ఏర్పాటు చేసి, ఆ ట్రస్టుకు స్థలాన్ని అప్పగించాలి. అక్కడ రామమందిర నిర్మాణం చేపట్టాలి. అలాగే సున్నీ వక్ఫ్ బోర్డుకు అయిదు ఎకరాల స్థలం ఇచ్చేలా చూడాలని కోర్టు తెలిపింది.

© Getty Images

11:20

అయోధ్యలోని వివాదాస్పద స్థలం హిందువులకే..  ముస్లింలకు మరో చోట స్థలం కేటాయింపు

ముస్లింలకు మరో చోట స్థలం కేటాయింపు అయోధ్యలో వివాదాస్పద ‘రామజన్మభూమి-బాబ్రీమసీదు’ స్థలం హిందువులకే కేటాయిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సున్నీ వక్ఫ్ బోర్డుకు అయిదెకరాల స్థలాన్ని వేరే చోట కేటాయింపు

11:15 వివాదాస్పద స్థలాన్ని భాగాలుగా పంచడం కుదరదు 

వివాదాస్పద స్థలాన్ని భాగాలుగా పంచడం కుదరదు. అదంతా ఒకే భూభాగం. దాన్ని ముక్కలు చేసే ప్రసక్తే లేదు. సున్నీ వక్ఫ్ బోర్డుకు వేరే చోట అయిదెకరాల స్థలం

సుప్రీం తుది తీర్పు నేపథ్యంలో అయోధ్యలో భారీ బందోబస్తు © Getty Images సుప్రీం తుది తీర్పు నేపథ్యంలో అయోధ్యలో భారీ బందోబస్తు

11:13

హైదరాబాద్‌లో గట్టి భద్రతా ఏర్పాట్లు

అయోధ్య తీర్పు నేపథ్యంలో హైదరాబాద్‌లో శాంతిభద్రతల పరిరక్షణకు అన్ని రకాల చర్యలు చేపట్టినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తెలిపారు. సున్నితమైన ప్రాంతాలలో ప్రత్యేక బలగాలను మోహరించామని, సోషల్ మీడియాలో అవాంఛిత వ్యాఖ్యలపై ఒక కన్నేసి ఉంచామని చెప్పారు.

11:07

1528 నుంచి 1856 మధ్య అయోధ్యలోని వివాదస్పద స్థలంలో నమాజు జరగలేదు

‘‘వివాదాస్పద స్థలంలో 1528 నుంచి 1856 మధ్య ఎలాంటి నమాజు జరిగినట్లు ఆధారాలు లేవు. చరిత్రలో యాత్రికులు చెప్పిన వాదనలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. హిందువులు అయోధ్యను రామజన్మభూమిగా భావిస్తారు, అది వారి నమ్మకం. ముస్లింలు దాన్ని బాబ్రీ మసీదు అంటారు. అయితే, ఇక్కడ రాముడు జన్మించాడని హిందువులు నమ్ముతున్నారనడంలో ఎలాంటి వివాదం లేదు’’

11:04 ముంబయి, రాజస్థాన్‌లోని గంగానగర్‌లో 144 సెక్షన్

అయోధ్య తీర్పు నేపథ్యంలో మహారాష్ట్ర రాజధాని ముంబయిలో ఆదివారం 11 గంటల వరకు 144 సెక్షన్ విధించారు. రాజస్థాన్‌లోని గంగానగర్‌లో నవంబరు 19 వరకు సెక్షన్ 144 విధించారు.

11:00 అయోధ్య రాముడి జన్మస్థలమన్న నమ్మకం ఈనాటిది కాదు: సీజేఐ

‘‘భక్తివిశ్వాసాలు, వ్యక్తుల నమ్మకాల ఆధారంగా వివాదాలు పరిష్కరించలేం. రాముడు అయోధ్యలోనే జన్మించాడని హిందువులు ఎప్పటినుంచో నమ్ముతున్నట్లు చరిత్ర చెబుతోంది.’’ అని సీజేఐ వ్యాఖ్యానించారు.

10:52 బాబ్రీ మసీదుకు ముందు అక్కడున్నది ఇస్లామిక్ నిర్మాణం కాదు

‘‘బాబ్రీ మసీదు ఖాళీ స్థలంలో నిర్మించింది కాదు, కానీ, అంతకుముందు అక్కడ ఉన్న నిర్మాణాన్ని కూల్చివేశారా లేదా అన్నది ఆర్కియాలజీ సొసైటీ ఆఫ్ ఇండియా స్పష్ఠం చేయలేదు. 

అంతకుముందు అక్కడున్నది ఇస్లామిక్ నిర్మాణం కాదు.

అంతకుముందున్న నిర్మాణం బాబ్రీమసీదు కంటే పెద్దది కాకున్నా దాదాపు అంతే స్థాయిలో ఉన్న కట్టడమే.

అంతకుముందున్నది దేవాలయమని, దానికి నల్లని స్తంభాలు ఉపయోగించారని పురావస్తు శాఖ వివరణలు సూచిస్తున్నాయి’’

- సీజేఐ రంజన్ గొగోయ్

10:45 షియా బోర్డు పిటిషన్‌ను కొట్టివేత

అయోధ్య కేసులో తీర్పు పాఠం చదువుతున్న చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్. షియా బోర్డు పిటిషన్‌ కొట్టివేత.

బాబ్రీ మసీదును కట్టింది ఖాళీ స్థలంలో కాదు, బాబ్రీ మసీదును మీర్ బాకీ నిర్మించారని చెప్పిన సీజేఐ

10:34 సుప్రీంకోర్టుకు చేరుకున్న సీజేఐ రంజన్ గొగోయ్

చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ సహా రాజ్యాంగ ధర్మాసనంలోని అయిదుగురు న్యాయమూర్తులు సుప్రీంకోర్టుకు చేరుకున్నారు. 

10:19 సుప్రీంతీర్పును గౌరవించండి: చంద్రబాబు 

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం చంద్రబాబు అయోధ్య తీర్పు నేపథ్యంలో ప్రజలంతా శాంతియుతంగా ఉండాలని పిలుపునిచ్చారు. ‘‘అయోధ్య విషయమై తీర్పు వెలువడబోతున్న సందర్భంలో ప్రజలందరికీ నా విజ్ఞప్తి ఒక్కటే. తీర్పు ఎవరికి అనుకూలంగా వచ్చినా అందరం హృదయపూర్వకంగా ఆ తీర్పును స్వీకరించాలి. సంయమనం పాటించాలి, మత సామరస్యం కాపాడాలి. శాంతి, సౌభాతృత్వంతో సమసమాజ నిర్మాణమే మన అంతిమలక్ష్యం కావాలి.’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు.

అలహాబాద్ హైకోర్టు © Getty Images అలహాబాద్ హైకోర్టు

10:15 అసలు వివాదం ఏంటి?

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య జిల్లా అయోధ్య నగరంలో ఒక భూభాగం కేంద్ర బిందువుగా ఉన్న వివాదానికి సంబంధించిన కేసు ఇది.

హిందూ దేవుడైన రాముడి జన్మస్థలంగా హిందువులు పరిగణించే స్థలంతో పాటు.. బాబ్రీ మసీదు కూడా ఉన్న స్థలం ఇది. ప్రధానంగా ఈ స్థలాన్ని సందర్శించటానికి అనుమతి గురించిన వివాదం ఇది. అలాగే.. ఇక్కడ మసీదును నిర్మించటానికి అంతకుముందు ఉండిన హిందూ దేవాలయాన్ని కూల్చివేయటం లేదా మార్చివేయటం జరిగిందా అనే అంశం కూడా ఈ కేసులో ఇమిడి ఉంది.

బాబ్రీ మసీదును 1992 డిసెంబర్ 6వ తేదీన ధ్వంసం చేశారు. ఆ ఉదంతం తర్వాత ఆ భూమి మీద యాజమాన్యానికి సంబంధించి అలహాబాద్ హైకోర్టులో కేసు నమోదైంది. ఆ కేసులో 2010 సెప్టెంబర్ 30వ తేదీన తీర్పు ప్రకటించారు.

అలహాబాద్ హైకోర్టుకు చెందిన ముగ్గురు న్యాయమూర్తులు.. అయోధ్య భూమిని మూడు భాగాలుగా విభజించాలని.. అందులో ఒక భాగం హిందూ మహా సభ ప్రాతినిధ్యం వహిస్తున్న రామ్ లల్లాకు, రెండో భాగం సున్నీ వక్ఫ్ బోర్డుకు, మూడో భాగం నిర్మోహి అఖాడాకు వెళుతుందని తీర్పు చెప్పారు.

ఇటువంటి సున్నితమైన అంశం మీద నిర్ణయం తీసుకోవటం ఎంత కష్టమో కోర్టు తన ఉత్తర్వులో వివరించింది. ''ఈ చిన్న భూభాగం మీద అడుగుపెట్టటానికి దేవతలు కూడా భయపడతారు. దీని నిండా లెక్కలేనన్ని మందుపాతరలున్నాయి. దానిని మేం శుభ్రం చేయాల్సి ఉంది'' అని తీర్పు వ్యాఖ్యానించింది.

అయితే, 2010 నాటి తీర్పుకు వ్యతిరేకంగా హిందువులు, ముస్లింలు అప్పీలు చేయటంతో ఆ తీర్పును సుప్రీంకోర్టు 2011లో సస్పెండ్ చేసింది.

 10:07  గెలుపోటముల మాటే వద్దు.. శాంతియుతంగా ఉండండి: మోదీ 

''అయోధ్య విషయంలో సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పు ఇచ్చినా అది ఒకరు ఓడినట్లు, ఒకరు గెలిచినట్లు కాదు. దేశంలో శాంతి, ఐకమత్యం, సద్భావన అనే మన గొప్ప బలం, సంప్రదాయానికి ప్రాధాన్యమివ్వాలని దేశ ప్రజలను కోరుతున్నాను'' అంటూ ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.

9:53  40 రోజుల సుదీర్ఘ వాదనలు 

అక్టోబరు 16న తన తీర్పున రిజర్వులో ఉంచారు. రామజన్మభూమి-అయోధ్య స్థల వివాదం కేసులో 40 రోజుల పాటు సుదీర్ఘంగా వాదనలు విన్న అయిదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం అక్టోబరు 16న తన తీర్పున రిజర్వులో ఉంచింది. సుప్రీంకోర్టు చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ కాలం వాదనలు విన్న రెండో కేసు ఇది. కేశవానంద భారతి కేసులో ఏకంగా 68 రోజుల పాటు వాదనలు విన్నారు. దాని తరువాత రామజన్మభూమి-అయోధ్య స్థల వివాదం కేసులోనే సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. ఆధార్ రాజ్యాంగబద్ధతపై కేసులో 38 రోజులు వాదనలు కొనసాగడంతో సుప్రీంకోర్టు చరిత్రలో దానికి మూడో స్థానం దక్కింది.

అయోధ్యలోని రామమందిరం, బాబ్రీమసీదు స్థల వివాదం కేసుపై శనివారం ఉదయం 10.30 దగంటలకు సుప్రీంకోర్టు తన తుది తీర్పు వెలువరించనుంది.

అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఈ తీర్పు సామాజిక, మత, సాంస్కృతికపరంగా పెను ప్రభావం చూపనుంది.

ఈ కేసు సున్నితత్వం నేపథ్యంలో మీడియా ఎలా వ్యవహరించాలనే విషయంలోనూ ఇప్పటికే మార్గదర్శకాలు వెలువడ్డాయి.

9:46 అయోధ్య తీర్పు: రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదంలో సుప్రీం తీర్పు కాసేపట్లో..

సుప్రీంకోర్టు చరిత్రలోనే అత్యంత సుదీర్ఘ కాలం వాదనలు విన్న రెండో కేసు అయోధ్యలోని రామమందిరం, బాబ్రీమసీదు స్థల వివాదం కేసుపై శనివారం ఉదయం 10.30 గంటలకు సుప్రీంకోర్టు తన తుది తీర్పు వెలువరించనుంది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ఈ తీర్పు సామాజిక, మత, సాంస్కృతికపరంగా పెను ప్రభావం చూపనుంది. ఈ కేసు సున్నితత్వం నేపథ్యంలో మీడియా ఎలా వ్యవహరించాలనే విషయంలోనూ ఇప్పటికే మార్గదర్శకాలు వెలువడ్డాయి.

© BBC

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

BBC తెలుగు నుంచి మరింత

image beaconimage beaconimage beacon