మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

టీడీపీ మాయం

నమస్తే తెలంగాణ లోగో నమస్తే తెలంగాణ 07-04-21 chandra kanth
టీడీపీ మాయం © నమస్తే తెలంగాణ ద్వారా అందించబడింది టీడీపీ మాయం

శాసన సభలో పార్టీల బలా బలాలు

మొత్తం అసెంబ్లీ స్థానాలు 119

టీఆర్‌ఎస్‌ 103

ఎంఐఎం 7

కాంగ్రెస్‌ 6

బీజేపీ 2

ఖాళీ 1

టీఆర్‌ఎస్‌ఎల్పీలో టీడీఎల్పీ విలీనమైన సందర్భంగా టీడీపీ శాసనసభ్యుడు సండ్ర వెంకటవీరయ్యకు గులాబీ కండువా కప్పుతున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు. చిత్రంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్‌రావు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ శాసనసభలో తెలుగుదేశం మాయమైపోయింది. రాష్ట్రంలో దాని ఉనికి నామమాత్రమైంది. 2018 ఎన్నికల్లో టీడీపీ తరఫున గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య (సత్తుపల్లి), మెచ్చా నాగేశ్వర్‌రావు (అశ్వారావుపేట) బుధవారం అధికారికంగా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు. టీడీఎల్పీని తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు.

ఈ మేరకు లేఖను స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డికి అందజేశారు. స్పీకర్‌ ఆ లేఖను ఆమోదించారు. అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులకు పంపించి.. టీఆర్‌ఎస్‌ఎల్పీలో తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం విలీన ప్రక్రియను పూర్తిచేశారు. ఈ మేరకు అధికారికంగా బులెటిన్‌ విడుదలచేశారు.

టీడీఎల్పీ విలీన అంశాన్ని శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డికి తెలియజేశారు. అనంతరం మంత్రి ప్రశాంత్‌రెడ్డితో కలిసి సండ్ర వెంకటవీరయ్య, మెచ్చా నాగేశ్వర్‌రావు.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావును కలిశారు. తమ విలీన నిర్ణయాన్ని ఆమోదించాల్సిందిగా ఎమ్మెల్యేలిద్దరూ విజ్ఞప్తిచేశారు. అనంతరం సీఎం కేసీఆర్‌ గులాబీ కండువా కప్పి వారిద్దరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కూడా వారితో ఉన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడానికి టీడీపీ ఎమ్మెల్యేలు ముందుకురావడం ఆహ్వానించదగ్గ పరిణామమని, తెలంగాణలో రాజకీయ పునరేకీకరణ జరుగుతున్నదని సీఎం కేసీఆర్‌ అన్నారు.

నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకే..సీఎం కేసీఆర్‌తో భేటీ అనంతరం మెచ్చా నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో అద్భుతమైన అభివృద్ధి కనిపిస్తున్నదని, సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను తన నియోజకర్గంలో మరింత విస్తృతంగా అమలుచేసేందుకే తాను పార్టీలో చేరుతున్నానని ప్రకటించారు. నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకే తానీ నిర్ణయం తీసుకొన్నానని స్పష్టంచేశారు.

విలీన వికాసంమంటిపనికైనా ఇంటివాడే కావాలని, తెలంగాణ ఆత్మగౌరవానికి అసలైన ప్రతీక టీఆర్‌ఎస్సేనని తెలంగాణ ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారని రాష్ట్రంలో చోటుచేసుకొంటున్న రాజకీయ పరిణామాలు చెప్పకనే చెప్తున్నాయి. ప్రజల్లో టీఆర్‌ఎస్‌కు పెరుగుతున్న ప్రజాదరణ, ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పట్ల ప్రజలకున్న ప్రగాఢ విశ్వాసం.. వెరసి రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌తో ఉంటేనే ప్రజలకు న్యాయం చేయగలమని ఎమ్మెల్యేలు బలంగా నమ్ముతున్నారు.

సీఎం వెన్నంటి నడవటానికి ముందుకొస్తున్నారు. 2014 సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ నియోజకర్గం నుంచి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, అదే జిల్లా సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఎస్పీ తరఫున గెలిచారు.

టీఆర్‌ఎస్‌ ప్రజా ప్రభంజనంతో తెలంగాణ తొలి శాసనసభ కొలువుదీరింది. కేసీఆర్‌ నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడింది. బీఎస్పీ నుంచి గెలిచిన ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు తమ పార్టీని టీఆర్‌ఎస్‌లో విలీనంచేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో మాధవరం కృష్ణారావు, చల్లా ధర్మారెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. తర్వాత ఎర్రబెల్లి దయాకర్‌రావు, శ్రీనివాస్‌యాదవ్‌, మాగంటి గోపీనాథ్‌, అరికెపూడి గాంధీ, కృష్ణారెడ్డి, వివేకానంద్‌, రాజేందర్‌రెడ్డి తదితరులు దశలవారీగా చేరి టీడీఎల్పీని టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనంచేశారు.

2018 ఎన్నికల్లో టీడీపీ రెండే సీట్లను గెలుచుకొన్నది. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి నియోజకవర్గం నుంచి సండ్ర వెంకటవీరయ్య, అశ్వారావుపేట నుంచి మెచ్చా నాగేశ్వర్‌రావు గెలిచారు.

ఇప్పుడు ఆ ఇద్దరూ టీఎర్‌ఎస్‌ఎల్పీలో విలీనం కావడంతో రాష్ట్ర శాసనసభలో టీడీపీ కనుమరుగైంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన సభ్యుల్లో 12 మంది టీఆర్‌ఎస్‌లో చేరిన విషయం తెలిసిందే. ఇక కోరుకంటి చందర్‌ (ఫార్వర్డ్‌ బ్లాక్‌), రాములునాయక్‌ స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచినా వారు టీఆర్‌ఎస్‌లో చేరిపోయారు.

విలీనం ఇలారాజ్యాంగంలోని పదో షెడ్యూలు నాలుగో పేరాలో పేర్కొన్న నిబంధన ప్రకారం ఏదైనా ఒక పార్టీలో మూడింట రెండొంతుల సభ్యులు, తాము వేరే పార్టీలో విలీనం కావాలనుకుంటే స్పీకర్‌ అనుమతించాలి. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు తాము టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనం కావాలని నిర్ణయం తీసుకోవడంతో నూటికి నూరుశాతం టీడీఎల్పీ టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనమైంది. ఈ ఇద్దరు ఇకనుంచి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు.

రాష్ట్రంలో ‘దేశం’ కథ ముగిసింది!తెలంగాణ నేల మీద టీడీపీ.. చరిత్రపుటల్లోకి జారింది. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలన అప్రతిహతంగా కొనసాగుతున్న కాలంలో సామాజిక, రాజకీయ పరిస్థితులకు మార్పుగా తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో నటరత్న ఎన్టీ రామారావు 1982, మార్చి 29న టీడీపీని స్థాపించారు.

1983 ఎన్నికల్లో ఉమ్మడి రాష్ట్రంలోని 289 అసెంబ్లీ స్థానాలకు 201 సీట్లలో ఘనవిజయం సాధించి అధికారాన్ని చెలాయించిన టీడీపీ ప్రస్థానం.. బుధవారం సండ్ర, మెచ్చా టీఆర్‌ఎస్‌లో చేరికతో పరిసమాప్తమైంది. దాదాపు 4 దశాబ్దాలపాటు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని అణచివేసిన టీడీపీ అమరావతికి శాశ్వతంగా తరలిపోయింది.

అసెంబ్లీలో టీడీపీ.. మండలిలో బీజేపీ అవుట్‌టీడీఎల్పీ టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనంతో అసెంబ్లీలో టీడీపీ ప్రాతినిథ్యం లేకుండాపోయింది. ఇటీవలి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌ స్థానం నుంచి బీజేపీ సిట్టింగ్‌ ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఓటమి పాలయ్యారు. ఈ స్థానంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి వాణీదేవి విజయం సాధించారు. దీంతో మండలిలో బీజేపీ గాయబ్‌ అయింది.

ఖమ్మంలో దుక్నం బంద్‌శాసనసభలో టీడీపీ తరుఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడటంతో ఖమ్మం జిల్లాలో తెలుగుదేశానికి ఉన్న కొంచె ఉనికి కూడా లేకుండా పోయింది. జిల్లాలో టీడీపీ నామరూపాలు లేకుండా పోయినట్టయింది.

టీడీపీ ఎమ్మెల్యేల నిర్ణయంతో ఆ రెండు నియోజకవర్గాల్లోని టీఆర్‌ఎస్‌, టీడీపీ శ్రేణుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్‌ఎస్‌ శాసనసభ్యుల బలం ఎనిమిదికి పెరిగింది. ప్రస్తుతం భద్రాచలం, మధిర నియోజకవర్గాల్లో మాత్రమే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారు.

More from Namsthe Telangana

image beaconimage beaconimage beacon