మీరు ఒక పాత బ్రౌజర్ వెర్షన్ను ఉపయోగిస్తున్నారు. ఉత్తమ MSN అనుభవం కొరకు, దయచేసిసహకారం అందించు వెర్షన్ను ఉపయోగించండి.

హిమాలయాలపై భారీగా చెత్త, శవాలు... శుభ్రత బాధ్యతను ఆర్మీకి ఇవ్వడంపై అభ్యంతరాలు

BBC తెలుగు లోగో BBC తెలుగు 16-02-20

ఈ వేసవి సీజన్‌‌లో హిమాలయ పర్వతారోహణ యాత్రకు నేపాల్ ఏర్పాట్లు చేస్తోంది. అయితే, పర్వతారోహకుల సంఖ్య భారీగా పెరుగుతుండటంతో హిమాలయ శిఖరాలపై ఏటా పెద్ద ఎత్తున చెత్త, శవాలు పోగవుతున్నాయి.

© PURNIMA SHRESTHA

గత ఏడాది ఒక్క ఎవరెస్టు ప్రాంతంలోనే 10,000 కిలోల చెత్తను సేకరించామని నేపాల్ ఆర్మీ చెప్పింది. ఈ ఏడాది కూడా ఏప్రిల్, మే నెలల్లో ఎవరెస్టు సహా హిమాలయాల్లోని ఆరు శిఖరాలను శుభ్రం చేసే బాధ్యతను నేపాల్ ప్రభుత్వం సైన్యానికే అప్పగించింది.

అయితే, ఆ పనిని అనుభవజ్ఞులైన స్థానిక షెర్పా తెగవారికి కాకుండా, ఆర్మీకి అప్పగించడంపై ప్రముఖ పర్వతారోహకులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సీజన్‌లో హిమాలయాల శుభ్రత కార్యక్రమం కోసం నేపాల్ ప్రభుత్వం దాదాపు 86 కోట్ల రూపాయలు (నేపాలీ కరెన్సీ) కేటాయించింది. జూన్ 5న జరిగే ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాటికి ఈ కార్యక్రమం పూర్తవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సీజన్‌లో వందలాది మంది విదేశీ పర్వతారోహకులు వచ్చే అవకాశం ఉందని నేపాల్ అధికారులు అంచనా వేస్తున్నారు.

గత ఏడాది ఎవరెస్టు ప్రాంతంలో 10 టన్నుల చెత్తను సేకరించినట్లు నేపాల్ సైన్యం వెల్లడించింది. కానీ, సైనికులు ఎక్కువ ఎత్తుకు వెళ్లలేదని, తక్కువ ఎత్తులో మాత్రమే శుభ్రం చేశారని 25వ సారి ఎవరెస్టును అధిరోహించేందుకు సిద్ధమవుతున్న కామి రీటా షెర్పా అంటున్నారు.

"సైనికులు పర్వతాల పై దాకా వెళ్లడంలేదు. ఎత్తైన ప్రదేశాల్లో శుభ్రం చేసే బాధ్యతను షెర్పా తెగ ప్రజలకు అప్పగించాలి. ఈ తెగకు చెందిన పర్వతారోహకులు మాత్రమే అంత ఎత్తువరకు వెళ్లి ఆ పని చేయగలుగుతారు" అని రీటా చెప్పారు.

"షెర్పాలు మాత్రమే ఎత్తైన శిఖరాల దాకా వెళ్లి శుభ్రం చేయగలరు. ఈ విషయాన్ని ప్రభుత్వం గ్రహించాలి" అని 21వ సారి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన పుర్బా తాషి షెర్పా అన్నారు.

ఈ పర్వతాలపై భారీగా ఆక్సిజన్ సిలిండర్లు, వంట గ్యాస్ సిలిండర్లు, క్లైంబింగ్ గేర్లు, మోకులు పేరుకుపోతున్నాయి. పర్వతారోహణ చేసే క్రమంలో అక్కడి కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక కొందరు మధ్యలోనే చనిపోతుంటారు. దాంతో కొన్ని శవాలు ఏళ్ల తరబడి అక్కడే మంచులో కూరుకుపోయి ఉంటున్నాయి.

అవన్నీ కలిపి వచ్చే సీజన్‌లో దాదాపు 35,000 కిలోల చెత్తను సేకరిస్తామని నేపాల్ ఆర్మీ ప్రతినిధి బిగ్యాన్ దేవ్ పాండే బీబీసీతో చెప్పారు.

© TWITTER/DHAULAGIRI2016

గత ఏడాది తాము పూర్తిగా శుభ్రం చేయలేకపోయామన్న విమర్శలను నేపాల్ ఆర్మీ తోసిపుచ్చింది.

"గతంలో చేసిన పొరపాట్లను సరిదిద్దుకుంటున్నాం. ఈసారి అత్యంత ఎత్తైన ప్రదేశాలతో పాటు ఆరు పర్వతాలనూ శుభ్రం చేసేందుకు తీవ్రంగా కష్టపడుతున్నాం. మానవ మృత దేహాలు కొన్ని దశాబ్దాలుగా పర్వత మార్గాల్లో ఉండిపోయాయి. వాటిని కూడా తొలగిస్తాం" అని పాండే అన్నారు.

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాలకు చిరునామాగా ఉన్న హిమాలయాలను అధిరోహించి, ప్రపంచ రికార్డులు నెలకొల్పేందుకు దేశ విదేశాల నుంచి ఏటా వందలాది మంది సాహస యాత్రికులు వస్తుంటారు.

సానుకూల వాతావరణ పరిస్థితులు ఉండే వసంత రుతువులో యాత్రికుల రద్దీ అధికంగా ఉంటుంది.

ఎవరెస్టు, లోట్సే, పుమోరి, అమదబ్లం, మనాస్లు పర్వత ప్రాంతాలకు యాత్రికులు పెద్దఎత్తున వస్తుంటారు. కాబట్టి, ఈ పర్వతాల మీద ఏటా భారీగా చెత్త పోగవుతోంది.

హిమాలయాల్లో అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక కొందరు చనిపోతుంటారు © BBC హిమాలయాల్లో అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకోలేక కొందరు చనిపోతుంటారు

యాత్రికుల పడేసే చెత్తను ఎవరికి వారు వెనక్కి తీసుకురావాలన్న కఠిన నిబంధనలు ఉన్నాయి. కానీ, చాలామంది ఆ నిబంధనలను పట్టించుకోవట్లేదన్న విమర్శలు ఉన్నాయి.

ప్రభుత్వ నిబంధనల ప్రకారం, పర్వతారోహణకు వెళ్లే ప్రతి బృందమూ 400 అమెరికన్ డాలర్లు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వారు పర్వతాల నుంచి చెత్తను, వ్యర్థాలను వెనక్కి తీసుకొస్తే తిరిగి ఆ డబ్బులు ఇచ్చేస్తారు. చాలామంది ఆ డబ్బులు వెనక్కి తీసుకునేందుకు ఎంతో కొంత చెత్తను వెనక్కి తీసుకొస్తుంటారు. అయినా, చాలా చెత్త, మానవ వ్యర్థాలు పర్వతాలపై ఉండిపోతున్నాయి.

"బరువైన సిలిండర్లను, శవాలను అంత ఎత్తులోని క్యాంపుల నుంచి తీసుకురావడం అత్యంత కష్టమైన పని. ఆ పనులు చేసేందుకు షెర్పాలు తమ ప్రాణాలనే పణంగా పెడుతుంటారు. గడ్డకట్టిన మృతదేహాలు దాదాపు 150 కిలోల దాకా బరువు ఉంటాయి. అంత బరువును కిందికి మోసుకురావడం షెర్పాలకు కూడా కష్టమేనని అనిపిస్తోంది" అని నేపాల్ పర్వతారోహకుల సంఘం మాజీ అధ్యక్షుడు షెరింగ్ షెర్పా అంటున్నారు.

© BBC

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

BBC తెలుగు నుంచి మరింత

image beaconimage beaconimage beacon